మనం

Share:

నవీన కవిత

Society & Culture


మతం, కులం

మద్యం, రాజకీయం

పుస్తకం, సాహిత్యం

పత్రికా, చలనచిత్రం

ఇలా ఇంకెన్నో వ్యాపకాలు

బాధ నుండి, భయం నుండీ

మనల్ని బయటపడేసే సాధనాలు


సమస్యను ఎదుర్కోవటం కాదు మన ప్రాధాన్యం

తప్పించుకునే మార్గం వెతకటమే మన ధ్యేయం

ఏ బాధా దానంతట అది పోదు

ఆ స్థానంలో ఇంకేదో వచ్చి చేరితే తప్ప


మనకి నచ్చిందే చేస్తాం

నమ్మిందే ఆచరిస్తాం

దాన్ని ఎవడైనా వ్యతిరేకిస్తే

వాడి అంతు చూస్తాం

అవతలి వాడి వాదన వినేందుకు

అస్సలు సిద్దంగా ఉండం

దేన్నైనా గుడ్డిగా ఆచరించటమే మనకి సౌకర్యం

కష్టపడి ఆలోచించటం ఎందుకులే అని

మెదడును ఇంట్లోనే వదిలేసొస్తాం


తప్పు ఒప్పుకున్న వాడిని పెద్ద మనసుతో క్షమించేస్తాం

మన తప్పుని ఎత్తి చూపితే మాత్రం భరించలేం

అహం అనే పంజరం దాటి ఎప్పుడూ బయటకు రాలేం

కోపం, క్రోధం, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ దాటి

మనిషిలా ఎప్పుడు మారుతాం?


మన విలువలు పేకమేడలు

కలలు సముద్రపు అలలు

ఆలోచనలు తీరం చేరని నావలు

మనసులు చీకటి గుహలు

మాటలు కూడా అరువు తెచ్చుకుంటాం

మన వాదనను నిరూపించుకునేందుకు

తన అజ్ఞానాన్ని మనపై రుద్దే

నాయకుడికి సైతం జై కొడతాం


తిడితే ఏడుస్తాం, పొగిడితే పొంగిపోతాం

అర్హత లేకున్నా ఆశపడతాం

ఆ అర్హత ఉన్నోడిని అక్కడిదాకా రానీకుండా అడ్డుపడతాం

తియ్యని మాటలు చెప్తూ మన చంక నాకేటోడు మంచోడు

ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటోడు చెడ్డోడు

మనసులో ఉన్నది చెప్పేందుకు అనుమతించం

మనిషిని మనిషిగా అంగీకరించం

ఇది మన ప్రజాస్వామ్యం

ఎందుకూ పనికిరాని వెధవల చేతిలో మన భవితవ్యం


YouTube:

www.youtube.com/c/NS360


Instagram I'd:

naveenchenna.s