Society & Culture
ఏ రోజుకారోజు ఏ మార్పూ లేదని ఏడుస్తూనే ఉంటాం
తీరా ఒకరోజు, ఏడాది అప్పుడే అయిపోయిందా?
అని తీరికగా ఆశ్చర్యపోతాం!
కాలాన్ని కొలవడానికి గడియారాన్ని వాడుతున్నామా,
గడియారం చూస్తూనే కాలాన్ని గడిపేస్తున్నామా మనం?
పారే నీటికి అంటదు మలినం
దూకే జలపాతానికి లేదు భయం
అలసట తెలుసా వీచే గాలికి
అలుపన్నది ఉందా ఎగిరే అలకి
రగిలే మంటకు పట్టదు చెద
నాటిన చోటే పాతుకు పోయే చెట్టుకి కూడా
పైకి ఎదగాలనే ఆశ సహజం కదా!
గడిచిన సమయం ఎప్పుడో చేరిపోయింది తన స్మశానానికి
మనమేదో దానిని సాగనంపినట్టు
కొత్తగా ఇప్పుడు సంబరాలు దేనికి?
తేదీలు మారిపోతూనే ఉంటాయి
కొత్త సంవత్సరాలు పాత బడిపోతుంటాయి
పుట్టడం, చావడం ఈ రెండే నిజాలు
గమనం, గమనించడం మాత్రమే మన గమ్యాలు
ఒక జన్మ సరిపోదు అనుకున్నవన్నీ నెరవేర్చుకోవడానికి
ఫలితం గురించి పట్టించుకోకుండా
మన దారిలో మనం సాగిపోతూనే ఉండాలి
naveenchenna.s@gmail.com